: రోజుకూలీ కొడుకు కామన్వెల్త్ లో 'కంచు' మోత మోగించాడు!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబంలో పుట్టిన గణేశ్ మాలి (21) ప్రతిభకు కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం లభించింది. గ్లాస్గోలో జరుగుతున్న ఈ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల కేటగిరీలో మాలి మూడోస్థానంలో నిలిచి భారత్ ఖాతాలో ఓ పతకాన్ని జతచేశాడు. అటు, తన కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తాడు. తనయుడు విదేశీ గడ్డపై పతకం సాధించడాన్ని టీవీలో ప్రత్యక్షంగా వీక్షించిన తండ్రి చంద్రకాంత్ మాలి సంబరపడిపోయాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ తాలూకా కురుంద్వాడ్ పట్టణం మాలి స్వస్థలం. కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించడంతో గణేశ్ మాలి ఇల్లు ఓ సందర్శనా స్థలంగా మారిపోయింది. బంధుమిత్రులు వచ్చి మాలి కుటుంబసభ్యులతో తమ ఆనందం పంచుకుని వెళుతున్నారు. కుమారుడి విజయం పట్ల తండ్రి చంద్రకాంత్ మాట్లాడుతూ, తన ఆనందానికి హద్దుల్లేవన్నాడు. గణేశ్ ఎంతో శ్రమజీవి అని, అతను తమను ఉన్నతస్థాయికి తీసుకెళతాడన్న నమ్మకం ఉందని తెలిపాడు. చంద్రకాంత్, అతని భార్య ప్రతి రోజూ కూలి పనికి వెళతారు. వర్షం వచ్చిన రోజు పని ఉండదు. ఆ విధంగానే తమ బిడ్డను ఈ స్థాయికి తెచ్చామని ఆ తండ్రి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గణేశ్ కూడా సంపాదిస్తుండడంతో వారి కుటుంబ పరిస్థితి కాస్త మెరుగైంది. ఇంటర్ వరకు చదవిన గణేశ్ అనంతరం ఎయిర్ ఫోర్స్ లో స్పోర్ట్స్ కోటా కింద చేరాడు. ఇక, గణేశ్ లో ఓ వెయిట్ లిఫ్టర్ ఉన్నాడని గుర్తించిన అతని కోచ్ ప్రదీప్ పాటిల్ శిష్యుడి ప్రదర్శన పట్ల పొంగిపోయారు. విదేశాల్లో పాల్గొన్న తొలి ఈవెంట్ లోనే గణేశ్ పతకం సాధించాడని తెలిపారు. గణేశ్ రాష్ట్రస్థాయి పోటీల్లోనే 242 కిలోలు బరువెత్తాడని, వాస్తవానికి అతడు స్వర్ణం గెలవాల్సిందని అభిప్రాయపడ్డారు.