: నేడు శివరామకృష్ణన్ కమిటీ రాక... రేపు బాబుతో భేటీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని నిర్ణయించేందుకు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నేడు హైదరాబాద్ రానుంది. ఈ కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రేపు ఉదయం భేటీ కానుంది. రాజధాని విషయంలో త్వరలో కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, శనివారం ఏపీ సీఎంతో కమిటీ జరపనున్న భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు, రాజధాని ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సలహా కమిటీ నేడు ప్రత్యేకంగా భేటీ కానుంది. రాజధాని సలహా కమిటీ ఈ ఉదయం 9 గంటలకు సమావేశం నిర్వహించనుంది. ఇంత హడావిడిగా ఈ కమిటీ సమావేశమవుతున్న క్రమంలో దాదాపుగా రాజధాని నిర్ణయంపై కీలక పరిణామాలు శనివారం నాటికి వెలువడే అవకాశాలున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే, రాజధాని నిర్మాణంలో ప్రభుత్వానికి తాము సహకారం అందిస్తామని చెబుతూ ముందుకొచ్చిన మెకిన్సే కన్సల్టెన్సీ, గడచిన వారం రోజులుగా సలహా కమిటీ చైర్మన్ నారాయణతో పాటు ఉన్నతాధికారులతో భేటీలు నిర్వహిస్తోంది. ఆరువారాల పాటు ఉచితంగానే సహకరించేందుకు తాము సిద్ధమని ఆ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలతో నిర్వహిస్తున్న భేటీల్లో వివిధ అంశాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను కూడా ఇస్తోంది. ఇక, రాజధాని ఎక్కడ అన్న విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని సలహా కమిటీ చైర్మన్ నారాయణ గురువారం మీడియాకు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉండటంతో పాటు సమాన దూరంలో ఉండే ప్రాంతాన్నే రాజదానిగా ఎంపిక చేస్తామని, అది విజయవాడ-గుంటూరు మధ్యలోనే ఉంటుందని కూడా ఆయన పునరుద్ఘాటించారు.

  • Loading...

More Telugu News