: ఉద్యమపథం నుంచి బోధనలోకి కోదండరాం


ప్రొఫెసర్ కోదండరాం... తెలంగాణ ఉద్యమంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అధ్యాపకుడు. ఆచార్యుడిగా ఉంటూనే ఉద్యమాల్లోకి వచ్చిన ఆయన తాజాగా బుధవారం ఉద్యమాలకు విరామమిచ్చి తన సొంత వృత్తి బోధనలోకి కాలిడనున్నారు. 2010 జనవరిలో సికింద్రాబాద్ పీజీ కళాశాలలో చివరిసారిగా పాఠాలు చెప్పిన ఆయన, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే క్రమంలో నాలుగేళ్లుగా బోధనకు దూరంగా ఉంటూ వచ్చారు. ఉద్యమాల్లో భాగంగా రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ హోదాలో ఉద్యమాన్ని, నేతలను సమన్వయపరిచి ప్రశంసలు పొందారు. రాజకీయ ఐకాస కృషితోనే తెలంగాణ రాష్ట్ర సమితితో ఉద్యోగ, విద్యార్థి సంఘాలకు మంచి సమన్వయం కుదిరిందన్న భావన తెలంగాణవ్యాప్తంగా వినిపించింది. తీవ్రస్థాయిలో జరిగిన ఉద్యమాల నేపథ్యంలో ఎట్టకేలకు 60 ఏళ్ల కల సాకారమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఇక తన బాధ్యత తీరిపోయిందని భావించారో, ఏమో తెలియదు కాని కోదండరాం మంగళవారం నేరుగా తాను పనిచేసిన సికింద్రాబాద్ పీజీ కళాశాలకు చేరుకుని అధికారికంగా విధుల్లో చేరిపోయారు. రిజిష్టర్ లో సంతకం కూడా చేశారు. బుధవారం కళాశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠాలు చెప్పేందుకే వచ్చినట్లు ఈ సందర్భంగా కోదండరాం తనను కలిసిన మీడియాకు చెప్పారు. కోదండరాం రాజనీతి శాస్త్ర విభాగంలో ఆచార్యుడిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News