: రాజధాని నిధుల కోసమూ కమిటీ ఏర్పాటట!


ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం, కేంద్రంతో సంప్రదింపులు తదితరాల కోసం ఓ కమిటీని నియమించిన సీఎం చంద్రబాబు నాయుడు, తాజాగా రాజధాని నిర్మాణానికి అవసరమయ్యే నిధుల సమీకరణపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కూడా మరో కమిటీని ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక, ఇప్పటికే ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు పూర్తైనట్లు, బుధవారమే కమిటీ ప్రకటన ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిన్నటి ఎన్నికల్లో పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడమే కాక, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వలస నేతలకు సీట్ల సర్దుబాటు, ఆయా ప్రాంతాల్లో అప్పటికే పార్టీ టికెట్లు తమకేనన్న ధీమా వ్యక్తం చేసిన వ్యక్తుల అసంతృప్తిని చల్లార్చడం తదితర పనులను నిమిషాల్లో చక్కబెట్టిన నారాయణకు ఇప్పటికే కీలక పాత్ర లభించింది. ఇదే తరహాలో చంద్రబాబుకు ఏళ్ల తరబడి సన్నిహితంగా ఉంటున్న సుజనా చౌదరికి తాజా కమిటీ పగ్గాలు అప్పగించనున్నట్లు సమాచారం. కెనరా బ్యాంకుకు గతంలో సీఎండీగా పనిచేసిన ఓ బ్యాంకింగ్ రంగ నిపుణుడి పేరు కూడా వినిపిస్తోంది. ప్రధానంగా ఆర్థిక పరమైన వ్యవహారాలను చక్కబెట్టనున్న ఈ కమిటీలో సభ్యులు కూడా ఆర్థిక రంగానికి చెందినవారే ఉంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అసలు నిధుల సమీకరణపై సలహాల కమిటీ విధివిధానాలేమిటన్న విషయం పూర్తిగా బహిర్గతం కానప్పటికీ, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.., రాజధాని నిర్మాణంలో ఈ కమిటీ కీలకంగా వ్యవహరించే అవకాశాలున్నాయి. నారాయణ కమిటీ సలహాలు, సూచనలను కూడా మార్చే స్థాయిలో ఈ కమిటీకి అధికారాలు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది నిధుల సమీకరణకు సంబంధించిన విషయం కావడంతో ఈ కమిటీకి అధిక ప్రాధాన్యత దక్కే అవకాశాలున్నాయి. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుంచి కొంత మేర నిధులు అందడం ఖాయం. అయితే కేంద్రం ఇచ్చే నిధులతోనే రాజధాని నిర్మాణం పూర్తి చేయొచ్చన్న భావన ఏ ఒక్కరిలోనూ వ్యక్తం కావడం లేదు. దీంతో కేంద్రం అందించే నిధులతో పాటు రాష్ట్రం కూడా స్వయంగా కొంత మేర నిధులను సమీకరించుకోవాల్సిందేనన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో ఏ ఏ మార్గాల్లో నిధులను రాబట్టవచ్చు, రాబట్టిన నిధులను ఏ ఏ పనులకు వెచ్చించాలి అన్న కీలక ఆర్థిక నిర్ణయాలు ఈ కమిటీ తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఈ కమిటీ తెరపైకి వస్తే, రాజధాని నిర్మాణంలో జెట్ స్పీడు నమోదవడం ఖాయంగానే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News