: ద గ్రేట్ మొగుడు... ఒకరికి తెలియకుండా మరొకరు... ఇలా ముగ్గురితో 20 ఏళ్లు


సినీ రచయితలు చెప్పినట్టు కొంతమంది ఒక భార్యతోనే వేగలేక చస్తుంటే, ముగ్గురు భార్యలను ఏమార్చాడా గడసరి మొగుడు. ఒకామెకి తెలియకుండా మరొకామె... వారిద్దరికీ తెలియకుండా మూడో మహిళ... ఇలా ముగ్గుర్ని పెళ్లి చేసుకుని 20 ఏళ్లు కాపురం చేసిన ఘనుడు పట్టుబడి శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకున్నాడు. చైనాలోని గువాంగ్ డాంగ్ లో తన భర్త చెన్ కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని అనుమానం వచ్చిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తీగలాగిన పోలీసులు ఆశ్చర్యపోయారు. పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విశేషాలు వెలుగుచూశాయి. 1992లో చెన్ (45) ఫిర్యాదు చేసిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ రిజిష్టర్ చేయించుకోలేదు. ఆమెకు తెలియకుండా 1994లో మరో మహిళను పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు. వారిద్దరికీ తెలియకుండా 2007 లో మరో మహిళను పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు. 2013లో భర్తపై అనుమానం వచ్చిన మొదటి భార్య పోలీసులను ఆశ్రయించింది. అక్రమ సంబంధం అయితే భర్తను క్షమించాలని భావించిన ఆమె మరో ఇద్దరు భార్యలు ఉన్నారని తెలిసి విడాకులు కోరింది. దీంతో పోలీసులు చెన్ ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. కేసు విచారణ జరుగుతోంది. చైనాలో బహుభార్యత్వానికి రెండేళ్ల జైలు శిక్ష అమలులో ఉంది. కాగా, చైనాలో అమ్మాయిలకు కొరత ఏర్పడింది. ఇతడి వ్యవహారం తెలిసిన పురుష పుంగవులు, ఓపక్క తమకు భార్య దొరకడమే కష్టంగా ఉంటే, వాడు ముగ్గుర్ని ఎలా ఏమార్చగలిగాడా? అని ఆశ్చర్యపోతున్నారు.

  • Loading...

More Telugu News