: దాశరథి కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం: కేసీఆర్
దాశరథి పేరిట ప్రతి ఏటా స్మారక అవార్డు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో దాశరథి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన దాశరథి 89వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాశరథి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం తనకు బాధ కలిగిస్తోందని... అతని కుమారులకు ప్రభుత్వం తరఫున మంచి ఉద్యోగాలను కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ కళలకాణాచి అని, తెలుగు భాషా వికాసానికి తెలంగాణ ఎనలేని కృషి చేసిందని కేసీఆర్ తెలిపారు. ఆంధ్రులదే అసలైన తెలుగు అని... తెలంగాణ వారిది మంచి తెలుగు కాదని చేస్తున్న విమర్శలను ఇకనైనా కట్టిపెట్టాలని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక సాహిత్య గోష్ఠులకు దూరమయ్యానని అన్నారు. తెలుగు భాషపై తనకు పట్టు వచ్చేలా చేసిన తన గురువులను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. రవీంద్రభారతికి ఏటా కోటి రూపాయల గ్రాంట్ ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ సాహిత్యాన్ని, సంస్కృతిని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళతామని చెప్పారు.