: మరోమారు వేడి పుట్టిస్తున్న అక్బరుద్దీన్ పర్యటన
మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలనాలకు కేంద్ర బిందువు! ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో ఓ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించి దేశవ్యాప్త చర్చకు తెరతీసిన ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ తరహాలో కేవలం ఒక్క ప్రసంగం కారణంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదైన నేపథ్యంలో దీన్నో అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. ఆ ఘటనతో అక్బరుద్దీన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అంతకుముందు పాతబస్తీలో ఆయనపై హత్యాయత్నం జరిగింది. ప్రత్యర్థులు జరిపిన దాడిలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఇక, అసెంబ్లీ సమావేశాల విషయానికొస్తే, ఏ అంశంపైనైనా ఉర్దూతో పాటు ఆంగ్లంలోనూ అనర్గళంగా గంటల తరబడి మాట్లాడే సత్తా అక్బరుద్దీన్ సొంతం. ఈ తరహా వాగ్ధాటి ప్రస్తుత మన నేతల్లో ఏ ఒక్కరికీ కూడా లేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో. తాజాగా మరోమారు అక్బరుద్దీన్ పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. దేశంలోని ప్రముఖ పత్రికలతో పాటు టీవీ ఛానెళ్లు కూడా ఈ విషయనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. తన సొంత పార్టీ, ఏఐఎంఐఎంను దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో భాగంగా, బుధవారం ఆయన మహారాష్ట్రలోని థానేలో పర్యటించాల్సి ఉంది. థానేలో ఏర్పాటు కానున్న బహిరంగ సభలో అక్బరుద్దీన్ పాల్గొనాల్సి ఉంది. తన పర్యటనకు సంబంధించి ఓ వైపు అక్బరుద్దీన్ సమాయత్తమవుతుండగా, థానే పోలీసు కమిషనర్ నుంచి సోమవారం ఆయనకు ఓ నోటీసు అందింది. థానేకు మీరు రావద్దంటూ ఆ నోటీసులో అక్బర్ కు ఆదేశాలందాయి. ఇది పార్టీ ప్రచారమంటూ చెప్పుకుంటున్న అక్బరుద్దీన్, ఉద్వేగంతో మాట్లాడే క్రమంలో మళ్లీ పాత పద్దతిలోనే ప్రజల మనోభావాలను నొప్పించేలా వ్యవహరిస్తే, చిక్కులు తప్పవని భావించినందునే థానే పోలీసు కమిషనర్ ఈ నోటీసులను జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే, తాను థానే వెళ్లి తీరతానని అక్బరుద్దీన్ చెబుతున్నారు. ఎమ్మెల్యేగా దేశంలో ఎక్కడైనా పర్యటించే హక్కు తనకుందని వాదిస్తున్న ఆయన, తనను అడ్డుకుంటే ప్రజాస్వామ్యయుతంగా పోరు సాగిస్తానని స్పష్టం చేస్తున్నారు. అంతేకాక థానే కమిషనర్ చర్యలపై మహారాష్ట్ర న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు కూడా వెల్లడించారు.