: రాజోలిబండ వద్ద భారీ బలగాల మోహరింపు
రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) మరమ్మతు పనులు ప్రారంభించేందుకు కర్ణాటక సర్కారు సమాయత్తమైన నేపథ్యంలో మంగళవారం ప్రాజెక్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ఆర్డీఎస్ కు కర్ణాటక చేపట్టనున్న మరమ్మతుల కారణంగా దిగువ ప్రాంతంలో ఉన్న తమకు నీటిచుక్క రాదని ఆందోళన చెందుతున్న కర్నూలు జిల్లా రైతులు ఆది నుంచి దీనిపై నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే రైతుల ఆందోళనలను పక్కనబెట్టిన కర్ణాటక సర్కారు మరమ్మతు పనులు చేపట్టేందుకే సిద్ధమైంది. అయితే, పనులను అడ్డుకుని తీరతామని చెబుతున్న కర్నూలు జిల్లా రైతాంగం, అందుకనుగుణంగానే ముందుకు కదులుతోంది. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ వద్ద ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న కర్ణాటక సర్కారు, మంగళవారం పనులు మొదలు పెట్టనుండటంతో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించింది. పోలీసు పహారాలోనే పనులు కొనసాగనున్నాయి.