: అమెరికాపై ఉగ్రపంజా.. బోస్టన్ లో పేలుళ్లు
దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ అగ్రరాజ్యం అమెరికాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. బోస్టన్ లో బాంబుపేలుళ్లకు తెగించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. 144 మంది వరకూ గాయపడినట్లు సమాచారం. వారిలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2001 సెప్టెంబర్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను విమానాలతో కూల్చివేసిన తర్వాత అమెరికా భద్రతాపరంగా చాలా పటిష్ఠమైన చర్యలు చేపట్టింది. ఫలితంగానే ఇన్నాళ్లూ ఎటువంటి ఉపద్రవం జరగకుండా నిరోధించగలిగారు. తాజాగా సోమవారం అర్ధరాత్రి బోస్టన్ లో బాంబు పేలుళ్లు జరగడం కలకలం రేపింది.
సోమవారం మాసాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ నగరంలో మారథాన్ జరిగింది. పరుగు పందెం చివరి లైన్ వరకు చేరుకునే సరికి రెండు వరుస పేలుళ్లు జరిగాయి. వెంటనే ఎఫ్ బిఐ దళాలు సంబంధిత ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి. రెండు పేలని బాంబులను వెంటనే నిర్వీర్యం చేశాయి. సహాయక దళాలు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించాయి. ఘటన నేపథ్యంలో లాస్ ఏంజెలెస్, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, వాషింగ్టన్ తదితర నగరాలలో హై అలర్ట్ ప్రకటించారు.నల్లరంగు బ్యాగు తగిలించుకున్న నల్లజాతీయుడి పనే ఇదని అనుమానిస్తున్నారు.
కాగా, పేలుళ్లను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా ఖండించారు. మృతులకు సంతాపం వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే పట్టుకుంటామని ప్రకటించారు. సహాయం కోసం భారతీయులు బోస్టన్ లోని భారతీయ ఎంబసీ కార్యాలయాన్ని ఈ నెంబర్ లో 202-939-7000 సంప్రదించవచ్చు.