: కొత్తవాళ్ళతో కుమ్మేసిన ధోనీ
ఒకప్పుడు టీమిండియా అంటే సచిన్, గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్, జహీర్, కుంబ్లే... ఇలా దిగ్గజాలతో నిండి ఉండేది. వాళ్ళలో జహీర్ మినహా అందరూ రిటైరయ్యారు. ఇప్పడు ఇంగ్లండ్ గడ్డపై అడుగిడిన భారత టెస్టు జట్టులో అనుభవజ్ఞులెవరూ లేరు. ముఖ్యంగా ఇంగ్లండ్ గడ్డపై టెస్టులాడిన అనుభవం ఉన్నది కెప్టెన్ ధోనీ, ఇషాంత్ లకే. అలాంటిది, ఇంగ్లండ్ జట్టును వారి సొంతగడ్డపై ఓడించడం మామూలు విషయం కాదు. అందుకు క్రెడిట్ ధోనీకే ఇవ్వాలి. ఇటీవల తరచూ విమర్శకుల బారిన పడుతున్న ఇషాంత్ లాంటి పేసర్ ను వెన్నుతట్టి ప్రోత్సహించి లార్డ్స్ లో అపురూప విజయాన్నందించాడీ మిస్టర్ కూల్. ఇషాంత్ కూడా తన ఏడు వికెట్ల స్పెల్ కు ధోనీయే కారణమని చెప్పాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కుక్ సేనను కట్టడి చేసిన భువనేశ్వర్ కుమార్ అటు బ్యాటింగ్ లోనూ రాణించడం విశేషం. ఇంతజేసీ ఇంగ్లండ్ గడ్డపై అతనికిదే తొలి సిరీస్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. రవీంద్ర జడేజా విషయానికొస్తే... ఆండర్సన్ తో వివాదం అతని ఏకాగ్రతకు భంగం కలిగించలేకపోయింది. లార్డ్స్ మ్యాచ్ లో జడ్డూ సాధించిన అర్థ సెంచరీ భారత్ ను పటిష్ఠ స్థితికి చేర్చింది. జడ్డూ, భువీ, లంబూ.... ఇలా అందరూ తమతమ బాధ్యతలను గుర్తెరిగి సమర్థంగా నిర్వర్తించారంటే... అంతా ధోనీ టానిక్ మహిమే. సహచరుల్లో స్ఫూర్తి నింపడంలో అతని తర్వాతే ఎవరైనా. ఈ విషయం ఐపీఎల్ ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. డ్వేన్ స్మిత్, ఈశ్వర్ పాండే వంటి ఆటగాళ్ళతో అద్భుతాలు సృష్టించగలనని నిరూపించకున్నాడు ధోనీ. ఇప్పుడు లార్డ్స్ లో విజయం ద్వారా భారత్ ను 1-0 ఆధిక్యంలో నిలిపిన జార్ఖండ్ డైనమైట్ మిగిలిన టెస్టుల్లోనూ ఇంగ్లండ్ ను చావుదెబ్బ కొట్టేందుకు తహతహలాడుతున్నాడు. జట్టులో ఇదే స్ఫూర్తి వెల్లివిరిస్తే ఫలితం మనవాళ్ళకు అనుకూలంగా ఉంటుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.