: హైదరాబాద్ ద్విచక్ర వాహనదారులకు ఇకపై హెల్మెట్ కంపల్సరీ!
హైదరాబాదులోని ద్విచక్ర వాహనదారులకు ఇకపై హెల్మెట్ తప్పనిసరి కానుంది. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై భారీ ఫైన్ వేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ విధానాన్ని అమలు చేసినప్పటికీ... ద్విచక్రవాహనదారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే ఈసారి మాత్రం హెల్మెట్ ధారణను కచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఒకేసారి కాకుండా అంచెలంచెలుగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేసుకుంటున్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా హెల్మెట్ ధారణపై ముందుగా ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించి... ఆ తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.