: మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో ఎంఐఎం
హైదరాబాదు నగరంలో పురుడుపోసుకున్న ఎంఐఎం పార్టీ దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మరో రెండునెలల్లో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఔరంగాబాదులో మాట్లాడుతూ, మహారాష్ట్ర ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామని వెల్లడించారు. ఆయన నగరంలోని పలు ఇఫ్తార్ విందుల్లో పాల్గొనేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల విషయమై మహారాష్ట్రలోని పార్టీ క్యాడర్ తో చర్చించనున్నారు. తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న విషయం ఇతర పార్టీల ప్రకటనపై ఆధారపడి ఉంటుందని ఒవైసీ తెలిపారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో పోటీచేయకపోవడానికి కారణం ఏమిటని మీడియా ప్రశ్నించగా... తాము పోటీచేయడం ద్వారా కొన్ని మతతత్వ పార్టీలకు లాభిస్తుందని ఇక్కడి సీనియర్ నేతలు చెప్పడంతో విరమించుకున్నామని పేర్కొన్నారు.