: ఎమ్ హెచ్ 17 దుర్ఘటన పాపం రష్యాదే: ప్రపంచదేశాల ఆరోపణ
మలేసియా విమానం ఎమ్ హెచ్ 17 దుర్ఘటన విషయంలో రష్యా పాత్రపై అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు విరుచుకుపడుతున్నాయి. రష్యన్ అనుకూల తిరుగుబాటుదారులు చేసిన ఈ పని ఏ మాత్రం క్షమార్హం కాదని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఫోన్ లో స్పష్టం చేశారు. అంతర్జాతీయ నిపుణులు సంఘటనా స్థలికి వెళ్లి పరిశీలించేందుకు ఉగ్రవాదులని ఒప్పించాలని ఆయన పుతిన్ ను కోరారు. ఇక, ఉక్రెయిన్ తిరుగబాటుదారులకు రష్యా మూడు 'బక్' క్షిపణులను అందించిందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆరోపించారు. ఎమ్ హెచ్ 17 కూల్చివేతలో రష్యా పాత్రపై తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని జాన్ కెర్రీ అన్నారు. ఉక్రెయిన్ ఉగ్రవాదులు కాల్పులు విరమించేలా చొరవ తీసుకోవాలని పుతిన్ ను జర్మన్ ఛాన్సలర్ మెర్కెల్ కోరారు. వేర్పాటు వాదులను అణిచివేయకపోతే రష్యాపై చర్యలు తప్పవని ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, అమెరికా దేశాలు పుతిన్ ను హెచ్చరించాయి. ఉక్రెయిన్ వేర్పాటువాదులకు శిక్షణ ఇవ్వడం... వారికి కావాల్సిన ఆయుధాలు సమకూర్చడం ఇకనైనా మానుకోవాలని అంతర్జాతీయ సమాజం రష్యాకు హితవు పలికింది.