: విరాట్ కోహ్లీ దారి మళ్ళాడా...?


జట్టు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా నేనున్నానంటూ ఆదుకునే టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఏమైంది..? ఎందుకు తరచుగా విఫలమవుతున్నాడు? ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టి వారాలు గడుస్తున్నా స్థాయికి తగ్గ ప్రదర్శన ఒక్కటీ అతని బ్యాట్ నుంచి జాలువారలేదు, ఎందుకని?... ఎక్కడ చూసినా ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు మీడియాలో. అవును, భారత్ ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై నాలుగు ఇన్నింగ్స్ ఆడేసింది. వాటిలో కోహ్లీ చేసిన మొత్తం పరుగులు 34. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టులో 1, 8... లార్డ్స్ టెస్టులో 25, 0... ఇవీ కోహ్లీ బ్యాటింగ్ గణాంకాలు. సాంకేతికంగా ఎంతో పరిపుష్ఠమైన ఆటగాడిగా మన్ననలందుకున్న ఈ ఢిల్లీ డైనమైట్ క్రికెటేతర విషయాల కారణంగానే ఫామ్ కోల్పోయాడని క్రీడావర్గాల్లో వినిపిస్తున్న టాక్. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మతో లవ్ ఎఫైర్ కోహ్లీ ఫామ్ ను దెబ్బతీస్తోందని మీడియాలోనూ కథనాలు వస్తున్నాయి. తాజాగా, బీసీసీఐతో మాట్లాడి మరీ తన ప్రియురాలిని ఇంగ్లండ్ పిలిపించుకునేందుకు 'స్పెషల్ పర్మిషన్' పొందిన ఈ యువకిశోరం ఆటపై దృష్టిమరల్చినట్టే కనిపిస్తోంది. అయితే, భారత మాజీ సారథి సునీల్ గవాస్కర్ మాత్రం కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. అతని ఫామ్ పై ఆందోళన అవసరంలేదని అంటున్నాడు. ఇలాంటి పిచ్ లపై ఎవరైనా ఇబ్బందిపడతారని చెప్పాడు. కాసింత అదృష్టం లోపించిందని, కోహ్లీ నాణ్యమైన ఆటగాడన్న విషయం అతని గత రికార్డులే చెబుతాయని సన్నీ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News