: మళ్లీ తెరపైకి నగదు బదిలీ పథకం!
నకిలీలను అరికట్టేందుకంటూ యూపీఏ సర్కారు ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకానికి మోదీ సర్కారు మళ్లీ జీవం పోసేందుకు నడుంబిగించింది. నగదు బదిలీ పథకం అమలు కోసం ఆధార్ కార్డుల జారీని ప్రవేశపెట్టడంతోపాటు పలు జిల్లాల్లో పథకాన్ని యూపీఏ ప్రభుత్వం అమలు చేసింది. వంట గ్యాస్ సబ్సీడీని బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా తలెత్తిన పలు సమస్యల నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో సార్వత్రిక ఎన్నికల ముందు ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసింది. తాజాగా అధికారం చేపట్టిన మోడీ సర్కారు కూడా నకిలీల ఏరివేతకు నగదు బదిలీనే సరైన మార్గమని భావిస్తోంది. క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు ఏ మేరకు సత్ఫలితాలిచ్చింది, దీనిపై లబ్దిదారుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఏ మేరకు నకిలీలు వెలుగు చూశారన్న అంశాలపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి, వీలయినంత త్వరలో నివేదిక అందజేయాలని ప్రణాళిక సంఘంతో పాటు ఆధార్ కార్డుల జారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఇరు విభాగాల అధికారులు ప్రస్తుతం ఈ పనిలో బిజీబిజీగా ఉన్నారట. నివేదికను పరిశీలించి ఆగస్టు 15 లోగా నగదు బదిలీపై కేంద్రం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.