: అనుమతులు ఆలస్యం చేసే అధికారులపై జరిమానా!


పరిశ్రమలు ఏర్పాటు చేసే క్రమంలో ప్రభుత్వం నుంచి భూములు తీసుకునే పారిశ్రామిక వేత్తలు వాటి ఏర్పాటులో జాప్యం చేస్తే, సదరు భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం సాధారణమే. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పారిశ్రామిక వేత్తలతో పాటు అనుమతులు జారీ చేసే అధికార గణం పాత్ర కూడా కీలకమేనని తెలంగాణ సర్కారు భావన. అందుకేనేమో, పరిశ్రమలను ఏర్పాటు చేస్తామంటూ ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అనుమతుల జారీలో జాప్యం చేసే అధికారులపై కేసీఆర్ సర్కారు దృష్టి సారించింది. ఇకపై అనుమతుల జారీలో ఏమాత్రం జాప్యం చేసినా, సదరు అధికారుల నుంచి జరిమానా వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అంతేకాదండోయ్, ఆ పెనాల్టీని అధికారుల అలసత్వం కారణంగా ఇబ్బందులకు గురైన పారిశ్రామిక వేత్తలకు అందించాలని తీర్మానించినట్లు సమాచారం. ఇందుకోసం ’రైట్ టూ సింగిల్ విండో క్లియరెన్స్‘ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. త్వరలో అమలులోకి రానున్న ఈ విధానం ప్రకారం, ఇకపై పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అనుమతులు పొందడం, పారిశ్రామిక వేత్తల హక్కుగా మారనుంది. ఈ హక్కు దక్కని పక్షంలో సదరు పారిశ్రామిక వేత్తలకు పైస్థాయిలో అప్పీలు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. నిర్ణీత సమయంలోగా అనుమతులు జారీ చేయని అధికారుల వేతనాల్లో కోతలు వేసి, ఆ సొమ్మును దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తకు అందిస్తారట. కొత్తగా ప్రకటించనున్న నూతన పారిశ్రామిక విధానంలో ఈ పద్ధతిని తెలంగాణ సర్కారు పొందుపరచడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇదే జరిగితే, అధికారుల నుంచి పారిశ్రామిక వేత్తలకు అంతగా ఇబ్బందులు ఎదురు కావు. పారిశ్రామికంగా ఆశించిన మేర ప్రగతి పరుగులు పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. పెద్ద పరిశ్రమలే కాక చిన్న తరహా పరిశ్రమలు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు కావడం ఖాయమే.

  • Loading...

More Telugu News