: ఆరు నెలల్లో రాజధాని పనులు ప్రారంభం: మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణ పనులు ఆరు నెలల్లోగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాజధాని నిర్మాణంపై సర్కారుకు సలహాలు, సూచనలు చేసేందుకు ఏర్పాటైన కమిటీ వివరాలను వెల్లడించిన సందర్భంగా, ఈ అంశంపై ఆయన పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. అందరికి ఆమోదయోగ్యమైన ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు కానుందని ఆయన చెప్పారు. రాజధాని రూపకల్పనకు సంబంధించి మూడు నెలల్లోగా పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తాజాగా ఏర్పడిన కమిటీ అధ్యక్షుడి హోదాలో ఆయన చెప్పారు. ఆరు నెలల్లోగా రాజధాని నిర్మాణ పనులను మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు కానుందన్న అంశం ఈ నెలాఖరులోగా తేలిపోతుందన్నారు. రాజధాని నిర్మాణం కోసం అవసరమయ్యే నిధుల విషయంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామన్నారు. రాజధాని ఏర్పాటు విషయంపై కేంద్రంతో చర్చించేందుకు సోమవారం ఢిల్లీ వెళుతున్నట్లు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శివరామకృష్ణన్ కమిటీని కలిసి, రాజధాని ఎంపిక విషయంలో తమ ప్రభుత్వ ప్రతిపాదనలను అందిస్తామని ఆయన చెప్పారు.