: పోలియో సోకిందని... కన్న బిడ్డనే వద్దనుకున్నారు!
మూడేళ్ల ఆ బాలికకు పోలియో సోకింది. మామూలు పిల్లలైతే, అంతగా పట్టించుకోకపోయినా ఫరవా లేదు కాని, ఇటువంటి బాలికను ఆమె తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా చూసుకుంటారు. సమాజ పోకడలను అతి దగ్గరగా గమనిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తారు. అవిటితనానికి గురైందని ఆ మూడేళ్ల బాలికను తల్లిదండ్రులే వదిలించుకోవాలని యత్నించారు. అయితే బాలిక ఆయుష్షు గట్టిది. బావిలో పడేసినా బతికి బట్టకట్టింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని రెంటచింతల మండలం నేలబావికి చెందిన రైతు పాత పుల్లారావు పంటకు నీరు పెట్టేందుకు శనివారం పొలానికి వెళ్లాడు. అయితే బావిలో నుంచి బాలిక ఏడుపు వినిపించడంతో పరిశీలించి చూడగా, బావిలోకి జారిన మర్రి ఊడలను పట్టుకుని వేలాడుతున్న పాప కనిపించింది. దీంతో తక్షణమే బావిలోకి దిగి పాపను బయటకు తీశారు. అనంతరం పుల్లారావు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు పాపకు స్థానిక వైద్యుడితో వైద్య పరీక్షలు చేయించి, పుల్లారావు పర్యవేక్షణలోనే ఉంచారు. చిన్నారి తల్లిదండ్రుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.