: ’శారద‘ స్కాంలో బెంగాల్ పోలీసులపై సీబీఐ అనుమానం
లక్షలాది మంది డిపాజిటర్లను నట్టేట ముంచిన శారద చిట్ ఫండ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో పశ్చిమబెంగాల్ పోలీసుల వ్యవహార సరళిపై సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. కంపెనీ ఏర్పాటుకు సంబంధించిన పలు కీలక పత్రాలను పశ్చిమ బెంగాల్ పోలీసులు నేటికీ సీబీఐకి అందజేయలేదు. ఎన్నిసార్లు అడిగినా, ఫలితం ఉండటం లేదని సీబీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పారు. నిందితులకు అనుకూలంగా వ్యవహరించే క్రమంలో పోలీసులే సదరు కీలక పత్రాలను మాయం చేశారా? అన్న కోణంలో సీబీఐ దృష్టి సారించింది. నిందితులతో కుమ్మక్కైన పోలీసు అధికారులు, సదరు పత్రాలను పూర్తిగా ధ్వంసం చేసి ఉంటారని కూడా సీబీఐ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ పోలీసు విభాగానికి చెందిన కొందరు పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించేందుకు సీబీఐ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.