: వీళ్లు ‘భలే దొంగలు’ బాసూ!


తమిళనాడులో ఇటీవల దొంగతనం జరిగిన తీరు చూసి, ఆ యజమాని ముక్కున వేలేసుకున్నాడు. వేలూరు జిల్లా మిన్నూరు రోడ్ పక్కన రామరాజన్ ఆరునెలలుగా హోటల్ నడుపుతున్నాడు. పని మీద, ఆయన స్వగ్రామమైన మధురై జిల్లా తిరుమంగళం వెళ్లాడు. శనివారం నాడు తిరిగి వచ్చిన తర్వాత తన హోటల్ లో దొంగతనం జరిగిన విషయం రామరాజన్ కి అర్థమైంది. హోటల్ లోని గల్లా పెట్టెలోని రూ.6,500 నగదు, మూడు జనరేటర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. దాంతో పాటు, హోటల్ లోని కొన్ని మైదాపిండి బస్తాలు కూడా మాయమయ్యాయి. అయితే, హోటల్ కిచెన్ లోకి వెళ్లి చూస్తే... ఆ వచ్చిన దొంగలు అక్కడ పరాటాలు, చట్నీ తయారుచేసుకుని, సుష్టుగా తిన్న తర్వాత... తీరిగ్గా అక్కడి నుంచి జారుకున్నట్లు తెలిసింది. అంతేకాదు, మైదాపిండి బస్తాను కూడా వారు తమతో పాటే తీసుకెళ్లారు. అయితే, ఆ బస్తాకి వారు కన్నం పెట్టడంతో... దారి పొడవునా మైదాపిండి కారింది. దీంతో, దొంగలు వెళ్లిన దారిని పోలీసులు గుర్తించారు. అయితే, సమీపంలోని ఫోర్ లైన్ రోడ్డు వరకు మాత్రమే మైదాపిండి ఉండటంతో... అక్కడి నుంచి వారు వాహనంలో పారిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News