: వచ్చే 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి చెదురుమదురు వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సాయంత్రం వరకు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా మారే అవకాశం ఉందని తెలిపారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.