: సచిన్ స్నేహితుడి భార్యకు కోర్టు ఆదేశం... నీ భర్తకు భరణం చెల్లించు!
గాంధీనగర్ కోర్టు ఓ అరుదైన తీర్పును వెలువరించింది. తన భర్తకు భరణం చెల్లించాల్సిందిగా భార్యను ఆదేశించింది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్నేహితుడు (ఇద్దరూ కలసి అండర్-17 ఆడారు) దల్బీర్ సింగ్ అనే మాజీ క్రికెటర్ వేసిన కేసు నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే, 2002లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దల్బీర్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. చాలా రోజుల పాటు మంచానికే పరిమితమయ్యాడు. ఆ సమయంలో దల్బీర్ శస్త్ర చికిత్సకు అయిన ఖర్చునంతా సచినే భరించాడు. కోలుకున్నాక, 2006లో రజ్ వీందర్ కౌర్ ను వివాహం చేసుకున్నాడు. అప్పట్నుంచి అతనికి భార్య నుంచి టార్చర్ మొదలైంది. ఆమె తనను పెళ్లైనప్పటి నుంచి మానసికంగా, శారీరకంగా వేధిస్తోందంటూ విడాకుల కోసం దల్బీర్ కోర్టుకెక్కాడు. కనీసం క్రచ్ ల సహాయంతో నడవడానికి కూడా అనుమతించేది కాదని... ఒక రకంగా చెప్పాలంటే గృహ నిర్బంధంలో ఉంచిందని కోర్టుకు తెలిపాడు. ఈ కేసులో దల్బీర్ పొరుగునే ఉండే పోలీస్ అధికారి కమలేష్ త్రివేది ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దల్బీర్ ను అతని భార్య తాళ్లతో కట్టి ఉంచేదని, విపరీతంగా వేధించేదని కోర్టుకు కమలేష్ తెలిపారు. అతని ఫిర్యాదుతోనే ఈ దారుణం వెలుగుచూసింది. ఈ క్రమంలో కేసును విచారించిన కోర్టు విడాకులు మంజూరు చేసింది. ప్రతినెలా దల్బీర్ కు రూ. 10 వేల చొప్పున భరణం చెల్లించాలంటూ రజ్ వీందర్ కౌర్ ను ఆదేశించింది.