: కలెక్టర్ మైండ్ బ్లాక్ చేసిన టీచర్!
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందాన ఓ టీచర్ బదిలీ వ్యవహారం చివరికి ఆమె ఉద్యోగానికే ఎసరు పెట్టింది. టీచర్లు అన్ని విషయాల్లో అవగాహన కలిగి ఉండాలన్నది ప్రాధమిక సూత్రం. కానీ, బీహార్లో ఆ సూత్రం సంగతి అక్కడి ఉపాధ్యాయినికి తెలియదు. అందుకే పాఠశాల తనిఖీకి వెళ్లిన కలెక్టర్ మైండ్ బ్లాకయ్యే సమాధానాలు చెప్పింది. దీంతో ఏం చేయాలో అర్ధం కాని కలెక్టర్ ఆమె ఏ ప్రామాణికత ఆధారంగా ఉద్యోగం సంపాదించిందో నివేదిక సమర్పించాలని ఎంఈవోకి ఆదేశాలు జారీ చేశారు. గయ జిల్లా కలెక్టర్ సంజయ్ కుమార్ అగర్వాల్ జనతా దర్బార్ లో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంత పాఠశాలకు వెళ్లారు. అక్కడ ఎవరికి వారు తమ బాధలు కలెక్టర్ కు చెప్పి పరిష్కారాలు కోరారు. ఇంతలో ఆ గ్రామంలో టీచర్ గా పని చేస్తున్న కుమారి అనిత తన ఇంటికి దగ్గరగా ఉన్న పాఠశాలకు బదిలీ చేయాలని విన్నవించారు. ఆమె జనరల్ నాలెడ్జ్ పరీక్షించాలని భావించిన కలెక్టర్ 'మన రాష్ట్రపతి ఎవరు?' అని ప్రశ్నించారు. 'ప్రతిభా పాటిల్' అని ఠక్కున సమాధానం చెప్పారు ఆ టీచర్. ఇలా కాదని 'బీహార్ గవర్నర్ ఎవరు?' అని కలెక్టర్ మరో ప్రశ్న సంధించారు. 'స్మృతి ఇరానీ' అని ఆమె ఠక్కున సమాధానం చెప్పారు. దీంతో మైండ్ బ్లాక్ అయిన కలెక్టర్ గారు ఆమె విద్యార్హతలతో బాటు, ఉద్యోగం ఎలా సంపాదించిందో తెలుపుతూ నివేదిక అందజేయాలని ఎంఈవోను ఆదేశించారు.