: నెల్లూరుకు ఎయిర్ పోర్టు వచ్చి తీరాల్సిందే: చంద్రబాబు
ప్రజల ఆరోగ్య భద్రత కోసమే ఎన్టీఆర్ హెల్త్ కార్డులను ప్రవేశపెడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆహార భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కూడా అత్యంత ముఖ్యమని అన్నారు. ఆర్ బీఐ నిర్ణయం ఎలా ఉన్నా... ఎట్టి పరిస్థితుల్లోను రుణమాఫీ అమలు చేసి తీరుతామని చెప్పారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయిందని మండిపడ్డారు. త్వరితగతిన పూర్తయ్యే ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు. ఏపీలో ఉన్నన్ని ఆలయాలు ఎక్కడా ఉండవని... ఈ ఆలయాల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోందని చెప్పారు. నెల్లూరుకు ఎట్టి పరిస్థితుల్లోను ఎయిర్ పోర్టు వచ్చి తీరాల్సిందే అని చంద్రబాబు అన్నారు. పోర్టుల ఆధారంగా అభివృద్ధికి పెద్దపీట వేయాలని చెప్పారు. విశాఖ నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.