: బంగారు పంటలపై అడవి జంతువుల స్వైరవిహారం


ఆ భూముల్లో వేరుశగన విరగకాస్తుంది. పంట మొత్తం చేతికొస్తే, ఆ రైతు ఇంట సిరులు కురవడం ఖాయమే. అయితే కొన్నిసార్లు వర్షాభావం పంటలను దెబ్బ తీస్తుంటే... మరికొన్నిసార్లు, వర్షాలు తగినంత మేర కురిసి పంట చేతికొస్తుందనగా, ఆ పంట అడవి జంతువుల పాలవుతోంది. దీంతో ఏటా అక్కడి రైతులకు నిరాశే మిగులుతోంది. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన సర్కారు కూడా అరకొర సహాయం చేసేసి చేతులు దులుపుకుంటోంది. ఇదీ అనంతపురం జిల్లాలో అటవీ ప్రాంతం సమీపంలోని మండలాల రైతుల దుస్థితి. జిల్లాలో అధిక భాగం పొలాలు వర్షాధారంపైనే సాగవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కొంతమేర భూమి స్థిరీకరణ అయినా, ఇప్పటికీ అధికశాతం పొలాల్లో వర్షాధార పంటలే సాగువుతున్నాయి. వీటిలో ప్రధానంగా వేరుశనగను అనంత రైతులు అధికంగా పండిస్తున్నారు. వర్షాలు కురవని ఏడాది అనంత రైతుకు నష్టం తప్పడం లేదు. అయితే వర్షాలు సమృద్ధిగా కురిసిన సమయాల్లోనూ పంటలు చేతికి అందడం లేదని రైతులు వాపోతున్నారు. దీనికి అడవి జంతువులే కారణమని చెబుతున్నారు. పంట చేతికొస్తుందనగా, అడవి పందులు పంటలపై స్వైరవిహారం చేస్తాయి. అడ్డుకోబోతే ప్రాణాలకే ప్రమాదం. మరి పంటలను రక్షించుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు దృష్టి సారిద్దామంటే అటవీ చట్టాలు, ఆర్థిక పరిస్థితులు దారులు మూసేస్తున్నాయి. తీరా పంట నష్టపోయాం ప్రభో, ఆదుకోండని సర్కారును ఆశ్రయిస్తే, అరకొర ఆసరానే అందుతోంది. దీంతో వర్షాలు సమృద్ధిగా కురిసిన సమయాల్లోనూ పంటను చేజిక్కించుకోలేకపోతున్నారు. ఈ తరహా ఘటనలపై ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు అటవీ శాఖ సంయుక్తంగా కసరత్తు నిర్వహిస్తే తప్పించి పరిస్థితి మారదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News