: చంద్రబాబుకు అంగరక్షకుల సాయం
రాష్ట్ర ప్రజలను సమస్యల సుడిగుండంలోంచి గట్టెక్కించాలన్న లక్ష్యంతో అవిశ్రాంత యోధుడిలా పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అనారోగ్యం వేధిస్తున్నా లక్ష్యపెట్టకుండా ముందుకు సాగుతున్నారు. ఇటీవలే తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర ముగించుకుని విశాఖ జిల్లాలో ప్రవేశించిన బాబు, ప్రస్తుతం తీవ్రమైన కాలినొప్పితో బాధపడుతున్నారు.
టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు పాదయాత్ర నిలిపివేయాలని ఎంత నచ్చచెప్పినా ఆయన కొనసాగింపునకే మొగ్గు చూపుతూ కార్యకర్తల్లో పోరాట స్ఫూర్తి నింపుతున్నారు. నిన్న ఆయనను పరీక్షించిన వైద్యులు ఇక తప్పనిసరిగా విరామం ప్రకటించాల్సిందే అని సూచించినా బాబులో అదే మొండితనం ప్రస్ఫుటమైంది. అందుకు నిదర్శనంగా నేడు ఆయన తన అంగరక్షకుల సాయంతో అలాగే ముందుకు సాగారు.
ఆరున్నర నెలలుగా పాదయాత్ర చేస్తున్న బాబు నేడు కాలివేళ్ళు కూడా సహకరించని స్థితిలో చివరకు భద్రతా సిబ్బంది ఆసరాగా ప్రస్థానం కొనసాగించడం చూపరులను కలచివేస్తోంది. కాగా, నిన్న విశాఖ జిల్లా శృంగవరంలో ఓ శిబిరంలో విశ్రాంతి తీసుకున్న బాబు, నేటి నుంచి 'మళ్ళీ వస్తున్నా.. మీకోసం' అంటూ ప్రజలను చైతన్యపరిచేందుకు సన్నద్ధమవుతున్నారు.