: సీరియళ్ళు చూస్తారు కానీ, అసెంబ్లీ సమావేశాలు చూడ్డానికి ఇష్టపడడంలేదు: బాబు
సినిమాలు, సీరియళ్ళు బాగుంటే ప్రజలు ఎన్నిసార్లయినా చూస్తారని, అదే అసెంబ్లీ సమావేశాలను ఒక్కసారి చూసేందుకు కూడా వారు ఇష్టపడడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సభలో సంస్కారవంతంగా మెలగడం ఎలాగో సభ్యులు అలవర్చుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు అంటే ప్రజల్లో చులకన భావం ఉందని, ఆ అభిప్రాయం పోగొట్టే బాధ్యత శాసనసభ్యులదేననీ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాట విలువైనదేనని చెప్పారు. సభలో ఒక్కోసారి అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయని... అలాంటప్పుడు సంయమనంతో మెలగడం నేర్చుకోవాలని బాబు హితవు పలికారు. ఎమ్మెల్యేలు రాష్ట్రానికి వనరుల్లాంటివారని... అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకుపోవాలని పిలుపునిచ్చారు.