: శ్రీనివాసునికి నిత్య కల్యాణమే... విరామమే ఉండటం లేదు!
తిరుమలపై కొలువైన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామికి నిత్యకల్యాణం, రోజూవారీ సేవలు వైభవంగా జరుగుతున్నాయి కానీ, విరామమే ఉండటం లేదు. శ్రీవారు పవళించేందుకు సమయం చిక్కడం లేదు. 365 రోజుల్లో 450కి పైగా ఉత్సవాలు, ఊరేగింపులు వేడుకగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 3.30 గంటలకు తోమాల సేవతో శ్రీవారి సేవ మొదలవుతోంది. అనంతరం ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి పవళింపు సేవ వరకూ నాన్ స్టాప్ గా శ్రీవారు భక్తులకు దర్శనమిస్తూనే ఉన్నారు. అయితే, రాత్రి 12 గంటల్లోపునే పవళింపు సేవ పూర్తి కావాలని ఆగమ శాస్త్ర పండితులు అంటున్నారు. శ్రీవారి విశ్రాంతి సమయంపై గతంలో చినజీయర్ స్వామి టీటీడీ అధికారులను నిలదీశారు. శ్రీవారికి కనీసం రోజూ రెండు గంటలైనా విశ్రాంతినివ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. సాధారణ దినాల్లో నిత్యం 63 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. మరో వంద రోజులు శ్రీవారిని... రోజుకు 65 నుంచి 70 వేల మంది భక్తులు, ఇక మరో వంద రోజులు 70 నుంచి 80 వేల మంది భక్తులు దర్శించుకుంటారని టీటీడీ అధికారులు తెలిపారు.