: ఢిల్లీలో బీజేపీ 'ఆపరేషన్ ఆకర్ష్' సక్సెస్..!
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేస్తున్న సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి మరో ఆరుగురు శాసనసభ్యుల మధ్దతు అవసరం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు శాసనసభ్యులను తమ వైపుకు తిప్పుకునేందుకు కాషాయదళం గత కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలు కొలిక్కివచ్చినట్టే కనిపిస్తున్నాయని ఢిల్లీలోని మీడియా వర్గాలు అంటున్నాయి. ఈ ఆరుగురు శాసనసభ్యులతో ఢిల్లీ బీజేపీకి డీల్ కుదిరిందని హస్తినలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఆరుగురిలో ఇద్దరికి కేబినెట్ బెర్తులు ఇవ్వడంతో పాటు మరో నలుగురికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించినట్టు సమాచారం. ఆరుగురు కాంగ్రెస్ శాసనసభ్యులతో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యులు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేకే తాము బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దమయ్యామని ఆరుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు అనధికార సంభాషణల్లో చెబుతున్నారు.