: వ్యవసాయ ఉత్పత్తుల్ని పరిశ్రమలకు అనుసంధానం చేస్తాం: బాబు
వ్యవసాయ ఉత్పత్తుల్ని పరిశ్రమలకు అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తానని అన్నారు. రుణమాఫీతో ప్రారంభించి, రైతులు లాభపడే అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోనే పశ్చిమగోదావరి జిల్లాను నెంబర్ వన్ జిల్లాగా మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రం 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో నడుస్తోందని ఆయన తెలిపారు. అయినప్పటికీ సంపదను సృష్టించి వ్యవసాయరంగంలో పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని బాబు అన్నారు. ప్రభుత్వమే రైతుల భూముల నాణ్యతను పరిశీలించి పంటలు సూచిస్తుందని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని బాబు స్పష్టం చేశారు. రైతులు పంట నిల్వచేసుకునేందుకు గిడ్డంగులు నిర్మిస్తామని ఆయన తెలిపారు.