: గుంటూరులో వివాదానికి దారి తీసిన పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు
గుంటూరులో పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలు వివాదానికి దారి తీశాయి. టీడీపీకి చెందిన కాపు నేతలు పవన్ కల్యాణ్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కొత్త తగాదాకు తెర లేపింది. గుంటూరు జిల్లాలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో నెగ్గిన కాపు నేతలకు తన్నీరు కిషోర్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. కాపు నేతలకు చెందిన సన్మాన కార్యక్రమం సందర్భంగా గుంటూరులో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో పవన్ కల్యాణ్ పేరును, ఫొటోను బాగా హైలైట్ చేశారు కాపు నేతలు. ఈ విషయం గుంటూరు జనసేన నేతలకు ఆగ్రహం తెప్పించింది. పవన్ కల్యాణ్ ను ఒక కులానికి సంబంధించిన నాయకుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని... ఇది ఏ మాత్రం సమంజసం కాదని జనసేన నేతలు అంటున్నారు. ఈ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని, లేకపోతే తామే ఆ పని చేస్తామని జనసేన నేతలు హెచ్చరించారు.