: కేసీఆర్ ఇంకా ఉద్యమకారుడిలానే మాట్లాడుతున్నారు: మంత్రి గంటా


1956కు ముందు తెలంగాణలో స్థిరపడిన వారి పిల్లలకే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికత అంశంపై రాజ్యాంగ సంక్షోభం సృష్టించొద్దన్నారు. ఈ విషయంలో స్థానికులు, స్థానికేతరులుగా చూస్తూ ఇంకా ఆయన ఉద్యమకారుడిగానే మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని చెప్పారు. ఈ మేరకు హైదరాబాదులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. తెలంగాణ వాటికన్ సిటీ కాదన్న గంటా, లక్షకోట్లతో రాజధాని నిర్మించుకుంటామన్న వారు బోధనారుసుం చెల్లించుకోలేరా? అని అడగటానికి కేసీఆర్ ఎవరని ప్రశ్నించారు. లక్షకోట్లతో కాకపోతే ఐదు లక్షలకోట్లతో రాజధాని నిర్మించుకుంటామని చెప్పారు. ఇచ్చిన హామీలనుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఆయనిలా మాట్లాడుతున్నారన్నారు. రేపే ఢిల్లీ వెళ్లి కేంద్ర మానవవనరుల శాఖ మంత్రిని కలసి పరిస్థితిని వివరిస్తామన్నారు. విద్యార్థుల భవిష్యత్ పై రాజకీయం చేయడం తగదని, కేసీఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నానన్నారు.

  • Loading...

More Telugu News