: హైదరాబాదులో వేల హోటళ్ళున్నా ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఇద్దరే..!
హైదరాబాదు నగరంలో ప్రస్తుతం రంజాన్, బోనాల సీజన్ నడుస్తోంది. దీంతో, ఆయా మత విశ్వాసాల ప్రకారం ప్రజలు ఇళ్ళలో భోజనాలు చేయడం తక్కువ. ముస్లింలైతే హలీం కోసం హోటళ్ళ బాటపడతారు. హిందువులు ఆలయాల వద్దే భోజనాలు చేస్తారు. సీజన్ పరంగా చూసినా, ఓవరాల్ గా చూసినా హైదరాబాదులో హోటళ్ళకు గిరాకీ ఎప్పుడూ ఉండేదే. కానీ, అక్కడ ఆహార నాణ్యత నాసిరకంగా తయారవుతోంది. తనిఖీ చేయాల్సిన ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. నగరంలో 15,000 హోటళ్ళు ఉండగా, వాటిని తనిఖీ చేయాల్సిన అధికారులు వందల్లో ఉంటారనుకుంటే పప్పులో కాలేసినట్టే. కేవలం ఇద్దరితోనే సరిపెట్టుకొస్తోంది జీహెచ్ఎంసీ. రిజిస్టర్ అయిన హోటళ్ళ సంఖ్య 5,800 కాగా, అనధికారిక హోటళ్ళ సంఖ్య 10,000 వరకు ఉందట. ఇన్నేసి హోటళ్ళకు 10 నుంచి 15 వరకు ఫుడ్ ఇన్ స్పెక్టర్లు అవసరమవుతారని జీహెచ్ఎంసీ ఫుడ్ అండ్ శానిటేషన్ విభాగం అదనపు కమిషనర్ రవి కిరణ్ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకముందే కొత్త సర్కారు ఫుడ్ ఇన్ స్పెక్టర్ల నియామకం చేపడుతుందని భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.