: ఏపీ, కర్ణాటక సరిహద్దులో తృటిలో తప్పించుకున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దుర్గాప్రసాద్ తృటిలో తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, ఇరు రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న చిక్ బళ్లాపూర్ జిల్లా (కర్ణాటక)లో దోపిడీకి దుర్గా గ్యాంగ్ ప్రయత్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్యాంగ్ ను పట్టుకునే ప్రయత్నంలో వారున్న స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో, ముదగానికుంట వద్ద పోలీసులు, దుర్గా గ్యాంగ్ కు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ లింగప్పకు గాయాలవడంతో, ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దుర్గా గ్యాంగుకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. అయితే, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దుర్గాప్రసాద్ మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. దుర్గాప్రసాద్ పై అనంతపురం, కర్ణాటకలో 70కి పైగా కేసులు ఉన్నాయి. అనంతపురం జిల్లా కదిరి సబ్ జైలు నుంచి దుర్గాప్రసాద్ కొద్దిరోజుల క్రితమే తప్పించుకున్నాడు.