: భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టు నేటి నుంచే


ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.25 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొదటి టెస్ట్ జరిగిన నాటింగ్ హామ్ కు, లార్డ్స్ కు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. తొలి టెస్ట్ జీవం లేని పిచ్ మీద జరగ్గా... లార్డ్స్ పిచ్ పై కొంత పచ్చిక ఉంటుంది. సీమర్లకు పిచ్ పూర్తిగా సహకరిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే... ఈ పిచ్ పై ఇంగ్లండ్ పేస్ ను ఎదుర్కోవడం టీమిండియా బ్యాట్స్ మెన్ కు పెను సవాలే. 2008 నుంచి 2014 మధ్య కాలంలో ఈ పిచ్ పై పేసర్లు 165 వికెట్లు పడగొట్టారు. స్పిన్నర్లు మాత్రం కేవలం 69 వికెట్లను మాత్రమే తీయగలిగారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు, పేసర్లకు పిచ్ ఏ రేంజ్ లో సహకరిస్తుందో చెప్పడానికి. ఈ మ్యాచ్ లో భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి టెస్టులో రాణించిన స్టువర్ట్ బిన్నీకి బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. అశ్విన్, జడేజాల్లో ఎవరినో ఒకరిని మాత్రమే తుది జట్టుకు ఎంపిక చేస్తారు. అయితే, జడేజాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మొదటి మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేసిన భారత్... ఈ మ్యాచ్ లో జయకేతనం ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది. ఇంగ్లండ్ కూడా పేస్ అస్త్రాలను సరైన రీతిలో ఉపయోగించుకుని బోణీ కొట్టాలని ప్రయత్నిస్తోంది. అయితే, కెప్టెన్ కుక్ ఫామ్ లో లేకపోవడం ఆ జట్టుకు అతి పెద్ద మైనస్ పాయింట్. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ 1, 3 ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి.

  • Loading...

More Telugu News