: రాహుల్ ద్రావిడ్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. లండన్ లోని ప్రతిష్ఠాత్మక లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అకాడమీలో రాహుల్ కు సభ్యత్వం లభించింది. లారియస్ స్పోర్ట్స్ అకాడెమీలో మెంబర్ షిప్ లభించడం పట్ల ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇది తనకు లభించిన గొప్ప గౌరవమని రాహుల్ పేర్కొన్నాడు. ఇప్పటికే అకాడమీ సభ్యుడైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవా రాహుల్ ద్రవిడ్ ను లారియస్ స్పోర్ట్స్ అకాడమీలోకి స్వాగతించాడు. ప్రస్తుతం ఈ అకాడెమీలో 46 మంది క్రీడా ఉద్ధండులు మెంబర్స్ గా ఉండగా... రాహుల్ ద్రవిడ్ చేరికతో ఈ సంఖ్య 47కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా విభిన్న క్రీడారంగాల్లో ఉన్న లెజెండ్స్ మాత్రమే లారియస్ స్పోర్ట్స్ అకాడెమీలో సభ్యులుగా ఉంటారు. వర్థమాన క్రీడాకారులకు, కోచ్ లకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం... క్రీడల ద్వారా వివిధ దేశాల మధ్య ఉన్న సామాజిక సరిహద్దులను చెరిపివేయడం లారియస్ స్పోర్ట్స్ అకాడమీ ప్రధాన లక్ష్యాలు.