: ఏపీలో పోలవరం ముంపు మండలాల విలీనం తగదు: జనశక్తి నేత కూర రాజన్న
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే మండలాలను ఏపీలో విలీనం చేయడం సరికాదని జనశక్తి నేత కూర రాజన్న అభిప్రాయపడ్డారు. బుధవారం ఓ కేసు విచారణ నిమిత్తం కరీంనగర్ జిల్లా వేములవాడ కోర్టుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన కేంద్రం, తెలంగాణ ప్రజల కాళ్లు, చేతులు నరికేసినట్లుగా ముంపు మండలాలను ఏపీలో కలిపేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల సంపదను కొల్లగొడుతున్న కేంద్రం, రాజ్యాంగంలోని ఐదో షెద్యూల్ ప్రకారం వారికి ప్రత్యేక కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మించకపోవడం వల్ల ఏపీకి అన్యాయం జరుగుతుందనడంలో అసలు అర్థమే లేదన్న ఆయన, ఇంజినీర్ల సూచనల మేరకు పెద్ద ప్రాజెక్టుకు బదులుగా చిన్న బ్యారేజీలు నిర్మిస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు.