: 100వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న ఐసీఎస్!
ఆ పెద్దాయన 100వ పుట్టినరోజు వేడుకను స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసీఎస్) రిటైర్డ్ అధికారి అయిన వల్లూరి కామేశ్వరరావు శత వసంతోత్సవానికి ఆయన కుమారుడు, పూర్వ ఐఏఎస్ అధికారి నారాయణరావు, కుమార్తెలు ఉష, వాణిలతో పాటు ఉన్నతాధికారులు రామారావు, విఠల్, జీపీ రావు, సీబీరావు, ఆనంద్ రామ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఆంద్రప్రదేశ్ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కామేశ్వరరావు మాట్లాడుతూ వందేళ్ల జీవితం దేవుడిచ్చిన వరమని అన్నారు. హైదరాబాదు శ్రీనగర్ కాలనీలో నివసించే కామేశ్వరరావు 15 జూలై, 1914లో తూర్పుగోదావరి జిల్లా తొత్తరమూడిలో జన్మించారు. రాజమండ్రి, మద్రాసులో విద్యాభాసం చేసిన ఆయన లండన్ కేంబ్రిడ్జిలో ట్రైపాస్ చదివారు. 1937లో ఐసీఎస్ కు సెలక్టయ్యారు. తూర్పుబెంగాల్ (ఇప్పటి బంగ్లాదేశ్) లోని మిడ్నాపూర్, కోల్ కతా, మద్రాస్, ఆంధ్రప్రదేశ్ తో ఆయన సేవలందించి 1973లో పదవీ విరమణ చేశారు.