: రేపటి నుంచి రెండో టెస్ట్... సిద్ధమైన ధోనీ సేన
గురువారం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభమవుతోంది. నాటింగ్ హామ్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. దాంతో ఈసారి లార్డ్స్ మైదానంలో జరిగే మ్యాచ్ లో గెలవాలని ధోనీ సేన ఉవ్విళ్లూరుతోంది. అయితే, 82 ఏళ్లలో భారత్ లార్డ్స్ మైదానంలో ఆడిన మొత్తం 16 మ్యాచ్ లలో... 11 ఓడిపోయింది. మరో నాలుగు డ్రా చేసుకోగా, గెలిచింది మాత్రం ఒకే ఒక్క మ్యాచ్ లో. 1986లో కపిల్ కెప్టెన్ గా ఉన్న భారత్ జట్టు ఇంగ్లండ్ పై ఘనవిజయం సాధించింది. ఆ టూర్ లో కపిల్ సేన 2-0తో సిరీస్ నెగ్గడం గమనార్హం. ఇక, 2002లో గంగూలీ సేన ఓటమి పాలవ్వగా, 2007లో ద్రావిడ్ కెప్టెన్సీలో భారత్ డ్రాతో గట్టెక్కింది. 2011లో ధోనీ సేన ఓటమి పాలయ్యింది. గురువారం నుంచి జరిగే రెండో టెస్ట్ కోసం కెప్టెన్ ధోనీ, విరాట్ కోహ్లీతో పాటు స్పిన్నర్లు అశ్విన్, జడేజా నెట్ ప్రాక్టీసులో పాల్గొన్నారు. తొలి టెస్ట్ లో ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగిన భారత్, లార్డ్స్ లోనూ అదే వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటోంది. తొలి మ్యాచ్ లో యువ పేసర్లు ఇషాంత్, భువనేశ్వర్, షమీ రాణించారు. ఇక, స్టువర్ బిన్నీ బౌలింగ్ లో ఆకట్టుకోలేకపోయినా, బ్యాటింగ్ అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో 78 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ లో ఇంగ్లండ్ ను ఎదుర్కొనేందుకు ధోనీ సేన సిద్ధమవుతోంది. రెండో టెస్ట్ లో విరాట్ కోహ్లీపై భారత్ ఆశలు పెట్టుకుంది. తొలి మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి తొమ్మిది పరుగులే చేసిన కోహ్లీ ఈసారి నిలకడగా ఆడేందుకు కసరత్తు చేస్తున్నాడు. శిఖర్ ధావన్, విజయ్, పూజారా, రహానే కూడా నెట్స్ లో చెమటోడ్చారు. రెండో టెస్ట్ లో భారత్ విజయం సాధించాలని కోరుకుందాం.