: సల్మాన్ ఖాన్ కు...మీడియాకు మధ్య మెగావార్!


సల్మాన్ ఖాన్ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఈసారి మీడియాపైనే కయ్యానికి కాలు దువ్వాడు సల్మాన్. శుక్రవారం జరిగిన 'కిక్' ప్రచార వేడుకలో సల్మాన్ కు, బాలీవుడ్ స్టిల్ ఫొటోగ్రాఫర్లకు గొడవ మొదలైంది. సల్మాన్ పర్సనల్ బాడీగార్డ్ లు తమతో అనుచితంగా ప్రవర్తించారని ఈవెంట్ జరుగుతున్న సమయంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఫొటోగ్రాఫర్లు. గొడవ మధ్యలో సల్మాన్ కలుగజేసుకుని, ఫొటోగ్రాఫర్లు కావాలంటే ఈవెంట్ కవర్ చేయవచ్చని, లేకపోతే వెళ్లిపోవచ్చని సభాముఖంగా చెప్పాడు. దీంతో అసలే కోపంతో ఉన్న ఫొటోగ్రాఫర్లు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. జరిగిన సంఘటనపై సల్మాన్ తమకు క్షమాపణ చెప్పవలసిందేనని... అంతవరకు తాము సల్మాన్ ఈవెంట్స్ ను కవర్ చేయమని ఫోటోగ్రాఫర్ల యూనియన్ బాలీవుడ్ కు తేల్చి చెప్పింది. అయితే, జరిగిన విషయాన్ని సల్మాన్ ఖాన్ చాలా లైట్ గా తీసుకున్నాడు. తన ఫొటోలు తీయకపోవడం వల్ల ఫోటోగ్రాఫర్లే పని కోల్పోతారని... అయినా వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు సల్మాన్. ఫొటోగ్రాఫర్లు తనపై విధించిన నిషేధాన్ని ఎంత ఎక్కువ కాలం కొనసాగిస్తే తాను అంత ఎక్కువగా హర్షిస్తానని సల్మాన్ మీడియాకు చురకలంటించాడు. బాలీవుడ్ పెద్దమనుషులు ఈ విషయంలో జోక్యం చేసుకుని గొడవను పరిష్కరించే పనిలో ఉన్నారని ముంబై సమాచారం.

  • Loading...

More Telugu News