: లండన్‌లో ఉత్సాహంగా బోనాల పండుగ


తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుంచి సుమారు 500లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. స్వరాష్ట్రంలో జరుపుకున్నట్టుగానే సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి, లండన్ వీధుల్లో జరిపిన తొట్టెల ఊరేగింపు ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా, అక్కడి స్థానికులను సైతం ముగ్ధులను చేసింది. ఈ సంవత్సరం జరుపుకొనే పండుగకు ఓ ప్రత్యేకత ఉందనీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరుపుకుంటున్న తొలి పండుగ కావడం, అలాగే తెలంగాణ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించడం కొత్త ఉత్సాహాన్ని, స్పూర్తిని ఇచ్చాయని కమిటీ సభ్యులు, వేడుకకు హాజరైన ప్రవాస తెలంగాణ బిడ్డలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమం అందరిని అలరించింది. ముఖ్యంగా కమిటీ మహిళా విభాగం సభ్యులు చేసిన తెలంగాణ జానపద నృత్యం హైలైట్ గా నిలిచింది. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ నిమిత్తం నిర్వహించిన 'రాఫెల్'లో అందరూ ఉత్సాహంగా పాల్గొనగా, విజేతలు స్వర్ణ, రజిత బహుమతులు గెల్చుకున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ సంస్థ జ్ఞాపికలతో అభినందించింది. సంప్రదాయ తెలంగాణ వంటకాలతో ఏర్పాటు చేసిన పండుగ విందు సొంత ఇంటి రుచులను తలపించిందని పలువురు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం పట్ల వ్యవహరించిన తీరుకి మరియు తెలంగాణ గవర్నర్ కి అదనపు బాధ్యతలు అప్పగించడం పట్ల ప్రవాస తెలంగాణ బిడ్డలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నారై ఫోరం అద్యక్షుడు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షుడు పవిత్రరెడ్డి కంది ఆధ్వర్యంలో జరిగిన 'బోనాల జాతర' ఇంతటి విజయం సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యులు అనిల్ కూర్మాచలంతో పాటు ప్రధాన కార్యదర్శి సుమన్ బాల్మురి, సంయుక్త కార్యదర్శులు ప్రవీణ్ రెడ్డి, గోలి తిరుపతి, ఈవెంట్స్ ఇంచార్జ్ ప్రమోద్, ఈవెంట్స్ సెక్రటరీ నగేష్ రెడ్డి, కల్చరల్ సెక్రటరీ మీనాక్షి, అడ్వైజరీ బోర్డు సభ్యుడు ఉదయ నాగరాజు, మీడియా ఇంచార్జ్ శ్రవణ్ రెడ్డి, మహిళా విభాగం సభ్యులు సుమ, స్వాతి, వాణి, నిర్మల, శ్వేతా, సుష్మ, హేమ, సుహాసిని, ఇతర కమిటీ సభ్యులు వెంకట్ రెడ్డి, సుధాకర్, అశోక్ గౌడ్, నవీన్ రెడ్డి, చిట్టి వంశీ, మల్లారెడ్డి, విక్రంరెడ్డి, నరేష్, రంగు వెంకట్, ప్రసాద్ తోట, శివాజీ షిండే, గోలి సుమన్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News