: మంచు లక్ష్మి పై కేటీఆర్ ప్రశంసలు
మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, రాష్ట్రమంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే పలు ఛారిటీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్న లక్ష్మీ తాజాగా 'టీచ్ ఫర్ ఛేంజ్' అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానము, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు మంచు లక్ష్మి ఈ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్ పార్క్ హోటల్ లో ఫ్యాషనేట్ సంస్థ మూడు రోజుల క్రితం ఓ ర్యాంప్ షోను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన కేటీఆర్... మంచు లక్ష్మి సామాజిక సేవను ప్రశంసించారు. ఛాన్స్ లభిస్తే మంచు లక్ష్మి తన కుమార్తె ఫోటోను నగరంలోని అన్ని చోట్ల ఏర్పాటు చేస్తుందని కేటీఆర్ చమత్కరించారు. (సరోగసీ ద్వారా మంచు లక్ష్మి ఇటీవల తల్లి అయ్యింది). ఈ కార్యక్రమంలో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు క్యాట్ వ్యాక్ చేశారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కూడా ఈ కార్యక్రమంలో ర్యాంప్ పై నడవడం విశేషం. గతంలో మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ సినిమా షూటింగ్ పై తెరాస నాయకులు, కార్యకర్తలు దాడిచేసినప్పడు మోహన్ బాబు, కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నేపధ్యంలో మంచు లక్ష్మిని కేటీఆర్ ప్రశంసించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.