: మూడువందల ఏళ్ళనాటి సంస్కృత రచన బెల్జియంలో ఆవిష్కరణ


దేవభాషగా పరిగణించబడే సంస్కృతం పట్ల భారతీయుల్లోనే కాదు, పాశ్యాత్యుల్లోనూ మోజు ఎక్కువేనని ఇంతకుముందు పలు కథనాలు చదువుకున్నాం. అయితే, ఎప్పుడో 300 ఏళ్ళనాటి ఓ సంస్కృత వ్యాకరణ గ్రంథం నేడు బెల్జియంలో వెలుగులోకి రావడం విస్మయం కలిగిస్తోంది. పైగా దాన్ని రచించింది ఓ జర్మన్ క్రైస్తవ మిషనరీ కావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

1700 సంవత్సరంలో భారత్ చేరుకున్న ఫాదర్ జోహాన్ ఎర్నెస్ట్ హాంక్సెల్డెన్ కేరళలో స్థిరపడ్డాడు. 1712లో వేలూర్ వద్ద ఈయన ఓ చర్చి కూడా నిర్మించాడు. అనంతరం అదే ఆయన నివాసం అయింది. ఆ సమయంలో భారత సంస్కృతి, సంప్రదాయాల పట్ల మక్కువ పెంచుకున్న ఫాదర్ జోహాన్ సంస్కృత భాషను అభ్యసించినట్టు తెలుస్తోంది. అనతికాలంలోనే భాషపై మంచి పట్టు సాధించిన ఈ జర్మన్ దేశీయుడు సంస్కృతంలో రచనలు చేసే స్థాయికి ఎదగడం విశేషం. అంతేగాకుండా, సంస్కృతం నుంచి రామాయణ మహాభారతాలను లాటిన్ లోకి అనువదించాడు కూడా.

అప్పుడు ఆయన చేతినుంచి జాలువారిన ఈ వ్యాకరణ గ్రంథం ఇన్నాళ్ళకు వెలుగులోకి వచ్చింది. రోమ్ లోని ఓ లైబ్రరీలో ఈ గ్రంథరాజం కొందరు పరిశోధకులకు దర్శనమిచ్చిందట. వారు ఈ పుస్తకం గురించి ఆరా తీస్తే అది మూడు దశాబ్దాల నాటిదని తేలింది. విషాదం ఏమిటంటే ఈ పుస్తక రచయిత ఫాదర్ జోహాన్ 1732లో పళువిల్ వద్ద పాముకాటుకు గురై తుది శ్వాస విడిచాడు. కాగా, 1994లో కేరళ ప్రభుత్వం ఆయన నిర్మించిన చర్చిని రక్షిత వస్తు సంపదగా ప్రకటించింది.

  • Loading...

More Telugu News