: రూపాయి కూడా ఖర్చు కాకుండా ఏపీ నుంచి టీఎస్ కు మార్పు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో, వాహనాల రాష్ట్ర కోడ్ మార్పు కోసం రవాణాశాఖ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణ జిల్లాల్లో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలన్నింటినీ ఏపీ నుంచి టీఎస్ కు మార్చడానికి ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించింది. ఈ సాఫ్ట్ వేర్ సహాయంతో కేవలం ఒకే ఒక్క క్లిక్ తో అన్ని వాహనాల రిజిస్ట్రేషన్లు టీఎస్ కు మారిపోతాయి. చాసిస్ నెంబర్, ఇంజిన్ నెంబర్, పాత రిజిస్ట్రేషన్ నెంబర్, కొత్త రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ కూడా ఆటోమేటిక్ గా నమోదవుతాయి. దీనికోసం వాహనదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్) స్మార్ట్ కార్డ్ కావాలంటే మాత్రం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి నామమాత్రపు ఫీజు చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. కోడ్ మార్పు విషయంలో, టీసర్కార్ మొదటి ప్రాధాన్యతను కమర్షియల్ వాహనాలకు ఇస్తోంది. కోడ్ మార్పు ప్రక్రియను ప్రారంభించడానికి ముందే ఈ వివరాలను బీమా, ఫైనాన్స్ కంపెనీలకు రవాణాశాఖ తెలియజేయనుంది.