: బాబు అభ్యర్థిగానే గెలిచా... టీడీపీ కుటుంబసభ్యుడినే: ప్రకాశం జడ్పీ ఛైర్మన్ హరిబాబు
తాను ముమ్మాటికీ టీడీపీ కుటుంబసభ్యుడినే అని ప్రకాశం జిల్లాపరిషత్ ఛైర్మన్ హరిబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేసి ఛైర్మన్ అయ్యానని చెప్పారు. ఉప ఎన్నిక సమయంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి ఇస్తామని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని... అయితే జిల్లాలోని కొంతమంది నేతలు తనను ఛైర్మన్ కాకుండా అడ్డుకోవాలని యత్నించారని మీడియాతో అన్నారు. తన ఛైర్మన్ అవకాశాలకు గండి పడే అవకాశం ఉండటంతో... విధిలేని పరిస్థితుల్లోనే, స్వతంత్రుడిగా ఛైర్మన్ బరిలోకి దిగానని వెల్లడించారు. జిల్లా టీడీపీ నేతల దగ్గరకు ముగ్గురు జడ్పీటీసీలు వస్తే... తాను ఏకంగా 27 మందిని తెచ్చుకున్నానని చెప్పారు. గెలవాలంటే పక్కవారిని లాక్కోక తప్పని పరిస్థితి... అలాంటప్పుడు నైతిక విలువల ప్రశ్న అవసరం లేదని అన్నారు. వైకాపా మద్దతుతో హరిబాబు ప్రకాశం జిల్లాపరిషత్ ఛైర్మన్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. జరిగిన ఘటనలపై త్వరలోనే అధినేత చంద్రబాబును కలసి వివరణ ఇస్తానని ఈ సందర్భంగా హరిబాబు తెలిపారు. జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయాలన్నా, పూలమాల వేయాలన్నా కేవలం తనకు మాత్రమే అర్హత ఉందని చెప్పారు. అయితే, జిల్లాలోని నాయకులెవరికీ తాను వ్యతిరేకం కాదని... సీనియర్ నేతలు కరణం బలరామ్, మంత్రి శిద్దా రాఘవరావు అంటే తనకు ఎంతో గౌరవం అని తెలిపారు. త్వరలో జరిగే కళాపరిషత్తు ఉత్సవాలకు వీరిని ఆహ్వానిస్తానని చెప్పారు.