: విజయవాడ ఎయిర్ పోర్టుకు త్వరలో రెండో రన్ వే
విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టులో త్వరలోనే రెండో రన్ వే ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఈ విషయమై కసరత్తులు చేస్తోంది. ప్రయాణికుల సంఖ్య పెరగడంతోపాటు, ఇక్కడి నుండి అమెరికా, ఆస్ట్రేలియాకు అంతర్జాతీయ సర్వీసులు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ల దృష్ట్యా ఎయిర్ పోర్టు అధికారులు ఏఏఐకి పలు ప్రతిపాదనలు పంపారు. కాగా, కొత్త రన్ వేను పాత రన్ వే పక్కనే ఏర్పాటు చేయనున్నారు. అయితే, నూతన రన్ వేను దేశీయ సర్వీసులకే వినియోగిస్తారు. అంతేగాకుండా, పాత రన్ వే నిడివిని 7,500 అడుగుల నుంచి 10,000 అడుగులకు పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం గన్నవరం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు 6 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. 90 శాతం ఆక్యుపెన్సీ రేటుతో నిత్యం 600-700 మంది ప్రయాణికులు ఇక్కడి నుండి ప్రయాణం చేస్తున్నారు.