: ఒంగోలులో 144 సెక్షన్... వందలాది పోలీసులతో భద్రత
ప్రకాశం జిల్లాపరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఒంగోలులో ఉత్కంఠభరిత పరిస్థితి నెలకొంది. టీడీపీ, వైకాపాలకు సరిసమానంగా జడ్పీటీసీలు ఉన్న నేపథ్యంలో, పరోక్ష ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. మరోవైపు, వైకాపా జడ్పీటీసీ రంగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది మరింత రాజకీయ వేడిని రగిలించింది. ఇప్పటికే ఈ నెల 5వ తేదీన జరగాల్సిన ఈ ఎన్నికలు గందరగోళ పరిస్థితుల నడుమ ఈ రోజుకు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో, నేడు ఒంగోలులో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు డీఎస్పీలు, 25 మంది సీఐలు, 45 మంది ఎస్సైలు, 400 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, ఒంగోలులో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేస్తున్నారు.