: అద్వానీ ఓ జర్నలిస్ట్... రాహుల్ గాంధీ ఓ స్ట్రాటజీ కన్సల్టెంట్!
ఎల్.కె.అద్వానీ బీజేపీ సీనియర్ నేత అనీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడని అందరికీ తెలుసు. కానీ, లోక్ సభ వెబ్ సైట్ ప్రకారం... వృత్తిపరంగా అద్వానీ ఓ జర్నలిస్టు అనీ, రాహుల్ గాంధీ ఓ స్ట్రాటజీ కన్సల్టెంట్ అని పేర్కొన్నారట. దేశంలో అగ్ర రాజకీయనాయకులైన వారిద్దరూ 16వ లోక్ సభలో సభ్యులు కూడా. అయితే, వెబ్ సైట్ లో మాత్రం వారి వృత్తి 'రాజకీయాలు' అని ప్రొఫైల్లో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మేరకు మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే ఓ ఉద్యమకారుడు లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ కు లేఖ రాశారు. పైన చెప్పిన కీలకమైన సమాచారాన్ని పరిశీలించి, తప్పయితే సరిచేయాలని కోరారు. ఎన్నికల్లో పోటీచేసే సమయంలో అఫిడవిట్ లో వృత్తిరీత్యా తాను సామాజిక కార్యకర్తనని అద్వానీ పేర్కొన్నారని, రాహుల్ పార్లమెంట్ సభ్యుడనని తెలిపారని శేఖర్ ఆంగ్ల మీడియాకు వెల్లడించారు.