: దిక్కుతోచని స్థితిలో తెలంగాణ బీజేపీ నేతలు


పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపేందుకు కేంద్రం ఆమోదం తెలపడంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నిన్నటి వరకు... 'రాష్ట్ర సాధనకు ఉద్యమాలు చేశాం... మేమే ఛాంపియన్, లోక్ సభలో సుష్మాస్వరాజ్ ఆంధ్రప్రదేశ్ నేతల విజ్ఞప్తులను పట్టించుకోకుండా తెలంగాణకు మద్దతు తెలిపారు' అని పదేపదే చెప్పిన ఆ రాష్ట్ర బీజేపీ నేతలు... ఇప్పుడు కేంద్రం చర్యను ఎలా సమర్థించాలో తెలియక తికమకపడుతున్నారు. కేంద్రాన్ని సమర్ధిస్తే ప్రజాగ్రహం చవిచూస్తారు... ప్రజల్ని సమర్ధిస్తే పార్టీ మండిపడుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు మౌనాన్ని ఆశ్రయించారు. నిన్న మొన్నటి వరకు ఆదివాసీల తరఫున ఉద్యమాలు చేస్తామని చెప్పి, ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలపవద్దని కోరుతూ, కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాన మంత్రిని, పార్టీ అధిష్ఠానాన్ని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. అయినా అధిష్ఠానం వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపేసింది. ఇప్పుడు ఉద్యమాలు చేసినా ఫలితం ఉండదు. అలా అని మౌనంగా ఉండలేని పరిస్థితి. విద్యుత్ విషయంలో పీపీఏల రద్దు, హైదరాబాద్ శాంతి భద్రతలపై గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు, పోలవరం ముంపు గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లో కలపడాన్ని తెలంగాణ బీజేపీ నేతలు సహించలేకపోతున్నారు. అలాగని కేంద్రానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో వారి పరిస్థితి ముందు గొయ్యి, వెనక నుయ్యిలా తయారైంది.

  • Loading...

More Telugu News