: తెలంగాణలో బస్సులు తిరగలేదు... స్కూళ్లు తెరవలేదు
పోలవరం బిల్లును పార్లమెంటు పాస్ చేసిన సందర్భంగా ఇవాళ టీఆర్ఎస్ చేపట్టిన తెలంగాణ బంద్ విజయవంతమైంది. హైదరాబాదులోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎంజీబీఎస్ నుంచి తెలంగాణ జిల్లాలతో పాటు విజయవాడ, కర్నూలుకు రాకపోకలు సాగించే బస్సులు ఆగిపోయాయి. ఎంజీ మార్కెట్ మెయిన్ రోడ్డులోని దుకాణాలు మూతబడ్డాయి. జంటనగరాల్లోని స్కూళ్లకు బంద్ సందర్భంగా సెలవు ప్రకటించారు. ఖమ్మం బస్ డిపో ఎదుట వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి బస్సు డిపో ఎదుట టీ-జేఏసీ ధర్నా చేపట్టింది. దీంతో, డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. బంద్ కారణంగా నిత్యం రద్దీగా ఉండే నల్గొండ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. నల్గొండ బస్ డిపో ఎదుట టీ-జేఏసీ నేతలు ధర్నా నిర్వహించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. బంద్ నేపథ్యంలో నిజామాబాదులోని గాంధీ చౌక్ చౌరస్తా నిర్మానుష్యంగా మారింది.